స్వీకరించిన ప్రతి ఫిర్యాదు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం…* • *ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక...* *జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.*

ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత జవాబుదారీతనం పాటించి ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, స్థానిక శాసనసభ్యులు కె. శ్రీనివాసరావు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వకరించిన ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఒక సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ప్రజల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, శాశ్వత పరిష్కార మార్గాలు చూపేందుకు కార్యక్రమం దోహపడుతుందన్నారు. ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం అవసరం, ఒక వ్యక్తి ఆశ ఉందనే భావనతో అధికారులు స్పందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సంతృప్తే ప్రభుత్వ పనితీరుకు నిజమైన కొలమానమని అధికారులు గుర్తించాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

తిరువూరు నియోజకవర్గం పరిధిలోని తిరువూరు ఎ కొండూరు రెడ్డిగూడెం, విస్సన్న పేట మండలాలకు సంబంధించి ప్రజల నుండి మొత్తం 173 ఆర్జీలను స్వీకరించడం జరిగింది. వీటిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం 94, రెవెన్యూ శాఖ 26, ఏపీ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం (APSWREIS) 14, పంచాయతీ రాజ్ శాఖ 10, ఏపీసీపీడీసీఎల్ (విద్యుత్ శాఖ) 6, గృహ నిర్మాణ శాఖ 5, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ 3, సర్వే సెటిల్‌మెంట్ మరియు భూ రికార్డుల శాఖ 3, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ 3, పోలీసు శాఖ2, రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) 2, సాంకేతిక విద్యా శాఖ 2 ఏపీ దివ్యాంగులు మరియు వృద్ధుల సహాయ సంస్థ , మద్యనిషేధం మరియు ఎక్సైజ్ శాఖ , పాఠశాల విద్యా శాఖ లకు సంబంధించి ఒక్కొక్క ఆర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

కార్యక్రమంలో తిరువూరు ఆర్‌డివో ఎ. కుమార్, పిడిఆర్‌డిఏ శ్రీనివాసరావు, డిపివో పి. లావణ్య కుమారి, డిఈవో ఎల్. చంద్రకళ, అగ్రికల్చర్ డిఎంఎఫ్ విజయకుమారి, జిల్లా అటవీ అధికారి జి. సతీష్, డ్వామా ఏపీడి పార్థసారధి తిరువూరు, ఎ కొండూరు, రెడ్డిగూడెం, విసన్నపేట, మండల తహాశీల్థార్లు వివిధ శాఖకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.