విజయవాడ...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మంగళవారం విజయవాడ అర్బన్ పరిధిలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్, ఎస్‌సీఈఆర్‌టీ, జెనీ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 100 పాఠశాలలకు సైన్స్ జెనీ బాక్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా ప్రభుత్వం బడుల్లో మెగా పీటీఎం, గ్రీన్ పాస్‌పోర్టు, 100 రోజుల కార్యాచరణ వంటి వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యను అందించేందుకు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక రసాయన జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తి,తో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ట్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. జెనీ సైన్స్ స్టార్టప్ ను రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) కూడా ప్రోత్సహించినట్లు తెలిపారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఆంధ్రాకు ఈ స్టార్టప్ రూపొందించిన సైన్స్ కిట్లు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
స్టూడెంట్ సైంటిస్టులపై ప్రత్యేక దృష్టి: డా. కె.శరత్ కుమార్, మెంబర్ సెక్రటరీ, ఆప్కాస్ట్
మనచుట్టూ ఉన్న పరిసరాల్లో వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు వేయడం, వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరీక్షించడం, స్వయంగా ప్రయోగాలు నిర్వహించడం ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి, ఆవిష్కరణల దిశగా వెళ్లేలా స్టూడెంట్ సైంటిస్టులపై ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు ఆప్కాస్ట్ సభ్య కార్యదర్శి డా. కె.శరత్ కుమార్ అన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్ర పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో శాస్త్రసాంకేతిక మండలి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. జెని బాక్స్ కిట్ల ద్వారా 40 రకాల ప్రయోగాలు చేసేందుకు వీలవుతుందని.. ఈ ప్రయోగాలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించి పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణ దిశగా నడిపించేందుకు అవకాశం కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2026 పోస్టర్లను ఆవిష్కరించారు. పదేళ్ల నుంచి 17 ఏళ్ల వయసుగల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి, డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్రశిక్ష ఏపీసీ ఆర్.రమేష్ బాబు, జెనీసైన్స్ వ్యవస్థాపకులు ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.