అమరావతి,....
ఇనామ్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రీ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఇన్నాం భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి, రైతులకు, భూముల యజమానులకు శాశ్వత న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లును తీసుకువచ్చినప్పటికీ, 2019 ఎన్నికల ముంగిట ఉండటంతో ఆ బిల్లును చట్ట సవరణ రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం సాధ్యం కాలేదని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు శ్రీ నెట్టెం రఘురాం గుర్తు చేశారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసిందని వివరించారు.
తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం జి.ఓ. నెం.144ను జారీ చేసిందన్నారు. అయితే, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడంతో రైతులు, భూముల యజమానులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై సమస్యను సమగ్రంగా పరిశీలించి, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించి, భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఈ వినతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో సమగ్రంగా పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీ నెట్టెం రఘురాం తెలిపారు.